rajnath singh: సముద్ర సంబంధ భద్రత సవాళ్లు భారత్‌కు మరో ఆందోళన కలిగించే అంశం: రాజ్‌నాథ్ సింగ్
- దేశాల సార్వభౌమాధికారాన్ని అన్ని దేశాలు గౌరవించాలి
- ఇండో పసిఫిక్ మహా సముద్రంలో స్వేచ్ఛాయుత వ్యవస్థ ఏర్పడాలి
- వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి
- అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు కట్టుబడాలి
దక్షిణ చైనా సముద్రం విషయంలో ప్రవర్తనా నియమావళికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సత్ఫలితాలను ఇస్తాయని భారత్ భావిస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆసియా రక్షణ మంత్రుల సమావేశంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రసంగించారు. సముద్ర సంబంధ భద్రత సవాళ్లు భారత దేశానికి మరో ఆందోళన కలిగించే అంశంగా ఉందని ఆయన చెప్పారు.
దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను అన్ని దేశాలు గౌరవించాల్సి ఉందని తెలిపారు. ఇండో పసిఫిక్ మహా సముద్రంలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత వ్యవస్థ ఏర్పడాలని ఆయన అన్నారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.
దక్షిణ చైనా సముద్రంతో పాటు అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత సముద్ర యానం జరగాలని అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు భారత దేశం మద్దతు ఇస్తోందని చెప్పారు. అలాగే, ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా ఉగ్రవాదంపై ఆందోళన చెందుతోందని అన్నారు. ఉగ్రవాదుల మధ్య నెట్‌వర్కింగ్ పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని దెబ్బ తీయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.