Gorantla Butchaiah Chowdary: ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతి రోజు 2 కోట్లు వసూలు చేస్తున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- ఏపీలో ఇసుక కుంభకోణం పెద్ద ఎత్తున సాగుతోంది
- నాలుగు మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వేస్తున్నారు
- ప్రతి రోజు 10 కోట్ల దోపిడీ జరుగుతోంది
ఏపీలో ఇసుక కుంభకోణం పెద్ద ఎత్తున సాగుతోందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వేమగిరి ర్యాంపులో నాలుగు మీటర్ల లోతులో ఇసుకను యంత్రాలతో తవ్వేస్తున్నారని మండిపడ్డారు. 10 టన్నుల ఇసుక కోసం డబ్బులు కట్టించుకుని, 8 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేస్తున్నారని అన్నారు.
ఇసుక లావాదేవీల్లో ఆన్ లైన్ పేమెంట్లు లేవని, కేవలం నగదు రూపంగానే వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి రోజు ఇసుక పేరుతో రాష్ట్రం మొత్తం మీద రూ. 10 కోట్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఉభయగోదావరి జిల్లాల్లోనే రోజుకు రెండు కోట్లు వసూలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ సారథ్యంలో రూ. 2,500 కోట్ల ఇసుక కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.
ఈ ఇసుక తవ్వకాలన్నీ సీఎం క్యాంప్ కార్యాలయం కనుసన్నల్లోనే జరుగుతున్నాయని గోరంట్ల అన్నారు. ఈ కారణం వల్లే జిల్లా అధికార యంత్రాంగాలు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. జేపీ కంపెనీ పేరుతో ఇసుక మాఫియా నడుస్తోందని అన్నారు.