High Court: దేవరయాంజల్ భూముల సర్వేపై హైకోర్టులో విచారణ
- ఐఏఎస్ ల కమిటీ ఏర్పాటు జీవో కొట్టివేయాలని పిటిషన్
- జీవో 1,014 అమలు నిలిపివేసేందుకు నిరాకరించిన హైకోర్టు
- ఆలయ భూములు గుర్తించేందుకు విచారణ చేస్తే ఇబ్బందేంటని ప్రశ్న
తెలంగాణలోని దేవరయాంజల్ భూముల సర్వేపై హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగుతోంది. ఇటీవలి ఐఏఎస్ల కమిటీ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని సదా కేశవ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, జీవో 1,014 అమలును నిలిపివేసేందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. అక్కడి దేవాలయ భూములు గుర్తించేందుకు సర్వే చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. అలాగే, ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా? అని హైకోర్టు నిలదీసింది.
ఆ భూములపై విచారణ జరిపి నివేదిక ఇవ్వడమే కమిటీ బాధ్యతని చెప్పింది. అయితే, నోటీసులు ఇవ్వకుండానే భూముల్లోకి వచ్చి సర్వే చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో భూముల్లోకి వెళ్లే ముందు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అలాగే, పిటిషనర్లపై చర్యలు తీసుకుంటే ముందస్తు నోటీసు ఇవ్వాలని చెప్పింది. అయితే, అక్కడి భూములపై విచారణ చేసే స్వేచ్ఛ కమిటీకి ఉందని, అధికారులకు అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లకు తెలిపింది. ఒకవేళ విచారణకు సహకరించకపోతే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.