Tennis: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ అనూహ్య నిర్ణయం!
- వింబుల్డన్, ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని ప్రకటన
- శరీర సహకారం మేరకే నిర్ణయమని వెల్లడి
- కేరీర్‌ను సుదీర్ఘకాలం కొనసాగించాలనుకుంటున్నానని వ్యాఖ్య
- 20 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన స్పెయిన్ దిగ్గజం
- ఇటీవలి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్లో ఇంటిబాట
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రానున్న వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొనడం లేదని ప్రకటించాడు. ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకున్నది కాదని, తన శరీరం సహకరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకొని.. తన బృందంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు.
తన కెరీర్‌ను మరింత సుదీర్ఘకాలం కొనసాగించడంతో పాటు, తనకు నచ్చింది ఎక్కువ కాలం కొనసాగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నాడు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడం కోసం అత్యున్నత స్థాయిలో పోరాడాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌కు, వింబుల్డన్‌కు మధ్య రెండు వారాల సమయం మాత్రమే ఉందని గుర్తుచేశాడు. క్లే కోర్టులో ఆడిన తర్వాత శరీరం కుదుటపడడం అంత సులువు కాదని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో మధ్య, దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు.
ముఖ్యంగా యూకే, జపాన్‌లో ఉన్న అభిమానుల కోసం ప్రత్యేకంగా సందేశం పంపుతున్నానని నాదల్ చెప్పాడు. ఒక ఆటగాడిగా తనకు ఒలింపిక్స్ ఎంతో కీలకమైందని తెలిపాడు. 20 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన నాదల్ 2008, 2010 వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచాడు. 2008 ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. కానీ, కొన్ని రోజుల క్రితం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో జొకోవిచ్ చేతిలో సెమీ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు.