New Delhi: ఢిల్లీ ‘బాబా కా ధాబా’ యజమాని ఆత్మహత్యాయత్నం
- మద్యం తాగి నిద్ర మాత్రలు మింగిన కాంతా ప్రసాద్
- ఢిల్లీ సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స
- యూట్యూబ్ వీడియోతో ఫేమస్ అయిన ప్రసాద్
ఢిల్లీ ‘బాబా కా ధాబా’ యజమాని కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయన్ను సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. మాలవీయ నగర్ లో ధాబా నిర్వహిస్తున్న ఆయన.. గౌరవ్ వాసన్ అనే యూట్యూబర్ ధాబా నిర్వహణపై వీడియో తీసి పోస్ట్ చేయడంతో రాత్రికి రాత్రే కాంతా ప్రసాద్ ఫేమస్ అయిపోయారు.
గురువారం రాత్రి 11.15 గంటలకు కాంతా ప్రసాద్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు సఫ్దర్ జంగ్ ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మద్యం తాగి నిద్ర మాత్రలు మింగాడని, ప్రస్తుతం ఆయన అచేతన స్థితిలోనే ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
బతకడం కోసం పోరాడుతున్న ఆయనకు సాయం చేయాలంటూ యూట్యూబర్ వీడియో చేయడంతో.. చాలా మంది ఆ ధాబాకు క్యూ కట్టారు. ఆయనకు దేశం నలుమూలల నుంచి నిధులు భారీగా వచ్చాయి. అందులో వాటాపై గౌరవ్ వాసన్ తో విభేదాలొచ్చి విడిపోయారు. తర్వాత ఆ నిధులతో పెద్ద రెస్టారెంట్ ను ప్రసాద్ ఓపెన్ చేశారు.
కరోనా లాక్ డౌన్ తో వచ్చిన నష్టాల వల్ల దానిని మూసేసి.. మళ్లీ ధాబాకే మొగ్గు చూపారు. మళ్లీ వాసన్ ఆయనకు అండగా నిలిచారు. మరి, రెస్టారెంట్ తెచ్చిన నష్టాల వల్లో లేదంటే మరే ఇతర కారణమో తెలియదుగానీ.. ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.