Sonia Gandhi: టీకాను ఎందుకు అంత రహస్యంగా వేయించుకున్నారు?: సోనియాపై బీజేపీ నేతల విమర్శల జల్లు
- రాయబరేలీ ప్రజల్ని సోనియా తమ కుటుంబ సభ్యులుగా భావించడం లేదా?
- వ్యాక్సిన్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది కదా?
- ఇప్పటికైనా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునివ్వాలి
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోవిషీల్డ్ రెండో డోసు కూడా తీసుకున్నారంటూ ఇటీవలే కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. అది కూడా బీజేపీ అడిగితేనే చెప్పారు. దీనిపై పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సొంత నియోజక వర్గం రాయబరేలీ ప్రజల్ని సోనియా తమ కుటుంబ సభ్యులుగా భావించడం లేదా? అని కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.
టీకాను ఎందుకు రహస్యంగా వేసుకున్నారని ఆయన నిలదీశారు. రాయబరేలీని ఎందుకు విస్మరించారని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా దీనిపై స్పందిస్తూ... వ్యాక్సిన్ పై కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు తప్పుడు ప్రచారాలు చేశాయని, ప్రజలను భయానికి గురిచేశాయని అన్నారు. ఇప్పుడు సోనియా మాత్రం వేయించుకున్నారని చెప్పారు.
ఓటర్లను సొంత మనుషులుగా సోనియా ఎప్పుడూ భావించలేదని, రాజకీయ లాభాల కోసమే వారిని వినియోగించుకున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని, ఇప్పటికైనా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రాయబరేలీ ప్రజలకు పిలుపునివ్వాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు.