Devineni Uma: ప్రజల సొమ్ముతో జగన్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు: దేవినేని ఉమ
- లక్షల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు
- 10 వేల పోస్టులతో సరిపెడుతున్నారు
- ఉద్యోగాల భర్తీ విషయంలోనూ తప్పుడు లెక్కలు
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దానిపై టీడీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా దేవినేని ఉమ ఈ విషయంపై స్పందిస్తూ... గత ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర చేసినప్పుడు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
అయితే, ఇప్పుడు 10 వేల పోస్టులతో సరిపెడుతున్నారని అన్నారు. నిరుద్యోగులను జగన్ జాబ్ క్యాలెండర్ పేరుతో ముంచారని ఆయన విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మే 30న 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారని, జూన్ 18న మాత్రం 6 లక్షలు ఇచ్చామని చెప్పారని తెలిపారు.
ప్రజల సొమ్ముతో జగన్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, ఆ తప్పుడు ప్రచారం నిరుద్యోగ యువతకు ఉపాధిని ఇస్తుందా? అని జగన్ను నిలదీశారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు 15 వేల టీచర్ ఉద్యోగాలు, రెండు విడతల్లో 6,748 పోలీస్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన చెప్పారు.