India: శాంతి కోసం భారత్ ఒక్క అడుగు వేస్తే పాక్ 2 అడుగులు వేస్తుందని ఇమ్రాన్ ఆనాడే చెప్పారు: పాక్ మంత్రి ఖురేషి
- సయోధ్య కుదుర్చుకోవాలని పాక్ భావించింది
- భారత్ సరైన విధంగా స్పందించలేదు
- చర్చలకు అనుకూల వాతావరణాన్ని పాడుచేసింది
భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న విభేదాలను తొలగించి భారత్‌తో సయోధ్య కుదుర్చుకోవాలని తమ దేశం భావించిందని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి చెప్పుకొచ్చారు. అయితే, భారత్ సరైన విధంగా స్పందించలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే చర్చలకు అనుకూలంగా ప్రకటన చేశారని చెప్పారు.
శాంతి కోసం భారత్ ఒక్క అడుగు ముందుకు వేస్తే పాక్ రెండు అడుగులు ముందుకు వేస్తుందని అన్నారని ఖురేషి చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తూ భారత్ స్పందించలేదని, చర్చలకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని పాడుచేసిందని వ్యాఖ్యలు చేశారు. 2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని తమ దేశం వ్యతిరేకిస్తోందని చెప్పారు.
ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయంగా లేవనెత్తామని చెప్పారు. కాగా, అఫ్ఘానిస్థాన్‌లో శాంతి కోసం భారత్ చేస్తోన్న కృషి గురించి కూడా ఆయన స్పందించారు. భారత్‌తో ధ్వైపాక్షిక సత్సంబంధాలను కొనసాగించేందుకు అఫ్ఘానిస్థాన్‌కు అన్ని విధాలుగా హక్కు ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అఫ్ఘానిస్థాన్‌లో అభివృద్ధి పనులు చేసేందుకు భారత్ కృషి చేస్తోందని, దీని పట్ల తమకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని చెప్పుకొచ్చారు.