Imran Khan: మహిళల వస్త్రధారణపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Imran Khan again blames women clothing for rapes in Pakistan

  • వారి వస్త్రధారణ వల్లే అత్యాచారాలన్న ఇమ్రాన్
  • గుడ్డ పీలికలు కట్టుకుంటే మగవారిపై ప్రభావం
  • రోబోలైతేనే ఉండదని కామెంట్లు

మహిళల వస్త్రధారణపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు ధరించే దుస్తుల వల్లే పాక్ లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మహిళలు గుడ్డపీలికలు కట్టుకుంటే మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఆ మగవారు రోబోలైతే తప్ప. ఇది మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం అంతే’’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.

పాకిస్థాన్ లో పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ప్రధాని ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ అన్నారు.  

ఆయన అన్నదానిని పూర్తిగా చెప్పకుండా కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రధాని చెప్పారన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసుపాలయ్యారు.

  • Loading...

More Telugu News