Supreme Court: పరీక్షల విషయంలో.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
- పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆగ్రహం
- రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
- ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరిక
ఏపీ ప్రభుత్వ తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో, ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని... ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీని ఎందుకు మినహాయించాలని వ్యాఖ్యానించింది. 12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? చెప్పాలని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి... సెప్టెంబరులో 11వ తరగతి పరీక్షలను నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది.