Team India: డబ్ల్యూటీసీ ఫైనల్: భారత్ వికెట్ల వేట... కివీస్ విలవిల
- సౌతాంప్టన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్
- నేడు ఐదో రోజు ఆట
- స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన కివీస్
- 2 వికెట్లతో సత్తా చాటిన షమీ
- లంచ్ వేళకు కివీస్ 135/5
సౌతాంప్టన్ లో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఓవర్ నైట్ స్కోరు 101/2తో ఐదోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు కొద్ది వ్యవధిలోనే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. రాస్ టేలర్ (11) ను అవుట్ చేయడం ద్వారా షమీ కివీస్ వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆపై హెన్రీ నికోల్స్ (7) ను ఇషాంత్ అవుట్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు నాలుగో వికెట్ చేజార్చుకుంది. షమీ మరోసారి విజృంభించి బీజే వాట్లింగ్ (1) ను బౌల్డ్ చేయడంతో కివీస్ కష్టాలు రెట్టింపయ్యాయి.
లంచ్ వేళకు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. షమీ, ఇషాంత్ చెరో 2 వికెట్లు తీశారు. అశ్విన్ కు ఓ వికెట్ లభించింది. కివీస్ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. పిచ్ పై ఉన్న తేమను భారత బౌలర్లు సద్వినియోగం చేసుకుంటున్న నేపథ్యంలో, న్యూజిలాండ్ కు మరిన్ని ఇక్కట్లు తప్పేలా లేవు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకు ఆలౌట్ అయింది.