Corona Virus: త్వరలో ఫైజర్ కరోనా టీకాకు భారత్‌లో అనుమతులు: సంస్థ సీఈఓ
- తుది దశకు ప్రభుత్వంతో సంప్రదింపులు
- త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం
- వెల్లడించిన సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా
- దేశంలో ఆందోళన కలిగిస్తున్న టీకాల కొరత
- విదేశీ టీకాలకు భారత్ ఆహ్వానం
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కరోనా టీకా ఫైజర్‌కు త్వరలో భారత్‌లో అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వంతో జరుపుతున్న సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయన్నారు. దీనిపై అతిత్వరలో ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదరనుందన్నారు.
దేశవ్యాప్తంగా టీకాల కొరత ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం విదేశీ టీకాలను భారత్‌కు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా ఇస్తామని తెలిపింది. విదేశీ టీకాలు భారత్‌లో కచ్చితంగా బ్రిడ్జింగ్ ట్రయల్స్ నిర్వహించాలన్న నిబంధన నుంచి మినహాయింపు కూడా ఇస్తున్నట్లు డీసీజీఐ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఈ తరుణంలో ఫైజర్ నుంచి తాజా ప్రకటన రావడం గమనార్హం.
మరోవైపు దేశవ్యాప్తంగా సోమవారమే సార్వత్రిక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ.. కేంద్రం ఉచితంగా టీకాలు అందజేస్తోంది. తయారీ సంస్థల నుంచి 75 శాతం టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. ఈ తరుణంలో ఫైజర్‌కు అనుమతి లభిస్తే కేంద్రమే ఆ టీకాలను సమకూర్చుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసే అవకాశం ఉంది.