Corona Virus: మూడో దశ ప్రయోగాల్లో 77.8% సామర్థ్యం కనబరిచిన కొవాగ్జిన్
- మూడో దశ ఫలితాలను డీసీజీఐకి సమర్పించిన భారత్ బయోటెక్
- నేడు సమావేశమైన నిపుణుల కమిటీ
- ఫలితాలను ధ్రువీకరించిన కమిటీ
- వెలువడాల్సి ఉన్న అధికారిక ప్రకటన
- రేపు డబ్ల్యూహెచ్ నిపుణులతోనూ భేటీ
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రూపొందించిన కరోనా టీకా కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగ ఫలితాల వివరాలు విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చాయి. ఈ టీకా కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో 77.8 శాతం సామర్థ్యాన్ని కనబరిచినట్లు సమాచారం. ఈ ఫలితాలకు నిపుణుల కమిటీ సైతం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఈ టీకా మూడో దశ ప్రయోగ ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ బయోటెక్ గత వారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐకి సమర్పించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల కమిటీ ఫలితాలను ఆమోదించినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ టీకా తొలి, రెండో దశ ప్రయోగ ఫలితాల ఆధారంగా దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లలో ఇది ఒకటి. మరోవైపు కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపునకు ప్రయత్నిస్తున్న భారత్ బయోటెక్ బుధవారం సంస్థ నిపుణులతో సమావేశం కానుంది. డబ్ల్యూహెచ్ నుంచి కూడా అనుమతి లభిస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ టీకాను సరఫరా చేసేందుకు మార్గం సుగమమవుతుంది.