Mekathoti Sucharitha: మొత్తం నది ఒడ్డున సీసీ కెమెరాలు పెట్టడం సాధ్యం కాదు: హోంమంత్రి సుచరిత
- దిశ యాప్ ను అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలి
- నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- ఎక్కడికైనా వెళ్తే స్నేహితులు, బంధువులకు సమాచారం ఇవ్వాలి
దిశ యాప్ పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ సూచించారని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. ఈ యాప్ ప్రతి యువతి, మహిళ ఫోన్ లో ఉండాలని చెప్పారు. ఈ యాప్ ఉంటే ఆపద సమయంలో బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదని... మూడు సార్లు ఫోన్ ను కదిపితే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుందని అన్నారు. ఇటీవల నది ఒడ్డున జరిగిన అత్యాచారం గురించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
నది ఒడ్డు మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పని కాదని సుచరిత అన్నారు. నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు కనీసం స్నేహితులకు, బంధువులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మహిళల భద్రతపై ఈరోజు సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.