Manthena Rama Raju: క్షత్రియుల అభివృద్ధి కోసం జగన్ రెడ్డి ఏం చేశారు?: టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు
- ఏం జరిగినా చంద్రబాబుకు ఆపాదించడం వైసీపీకి అలవాటయింది
- కులాల మధ్య చిచ్చు రాజేసే నీచమైన పార్టీ వైసీపీ
- క్షత్రియుల మధ్య జగన్ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు
రాష్ట్రంలో ఏది జరిగినా తమ అధినేత చంద్రబాబుకు ఆపాదించడం వైసీపీకి అలవాటైపోయిందని టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కులాన్ని తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో వైసీపీ నేత శ్రీరంగనాథరాజుపై మంతెన విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కులాన్ని తిట్టినట్టు ఎలా అవుతుంది రంగనాథరాజు? అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు రాజేసి, ఆ మంటల్లో చలి కాచుకునే నీచమైన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. మీ పార్టీకి ఉన్న కుల పిచ్చిని అన్ని పార్టీలకు అంటించాలనుకుంటే ఎలాగని ప్రశ్నించారు. విపక్షాలను ఎదుర్కోవడం చేతకాక... క్షత్రియుల మధ్య జగన్ రెడ్డి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు.
క్షత్రియుల అభివృద్ధి కోసం జగన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. 822 నామినేటెడ్ పదవుల్లో ఒక్క పదవినైనా ఇతర కులానికి కట్టబెట్టారా? అని ప్రశ్నించారు. బీసీలందరూ ఐకమత్యంగా ఉన్నారనే భావనతో, వారి మధ్య చిచ్చు పెట్టేందుకు కులానికి ఒక కార్పొరేషన్ ను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. గొప్ప రాజవంశంలో పుట్టిన అశోక్ గజపతిరాజును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెధవ అని అన్నప్పుడు శ్రీరంగనాథరాజు ఎక్కడున్నారని ప్రశ్నించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.