Andhra Pradesh: ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు అఫిడవిట్
- గత నెలతో పోల్చితే కరోనా కేసులు తగ్గాయి
- అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు
- అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నాం
- పరీక్షల నిర్వహణ కంటే ప్రత్యామ్నాయ మార్గం లేదు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీలో గత నెలతో పోల్చితే కరోనా కేసులు తగ్గాయని తెలిపింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఆదేశాల మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది మెహ్‌ఫూజ్ నజ్కీ అఫిడవిట్ దాఖలు చేశారు.
శ్రీవాస్తవ సహాయ్ వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో భాగంగా ఈ అఫిడవిట్ దాఖలైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నిపుణులు కూడా పరీక్షల నిర్వహణ సాధ్యమేనని చెప్పారని ప్రభుత్వం ఆ అఫిడవిట్ ద్వారా తెలిపింది. కరోనా నిబంధనలు పాటిస్తూ వచ్చే నెలాఖరులో పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు తెలియజేసింది.
అలాగే, కాలేజీలు నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల ఫలితాలపై ఇంటర్మీడియట్ బోర్డుకు ఎలాంటి నియంత్రణ ఉండదని తెలిపింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ లో 12వ తరగతి మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందని గుర్తు చేసింది. ఆయా అంశాలను పరిశీలించి పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
విద్యార్థులకు 15 రోజుల ముందుగానే పరీక్ష తేదీలు వెల్లడిస్తామని, ప్రస్తుతం 12వ తరగతి ఫలితాల వెల్లడికి పరీక్షల నిర్వహణ తప్ప ఇతర ప్రత్యామ్నాయం లేదని పేర్కొంది. పదో తరగతి ఫలితాలు గ్రేడ్‌లలో ఉంటాయని, కాలేజీల్లో నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల మార్కులపై బోర్డుకు నియంత్రణ ఉండదని చెప్పింది.
ఈ నేపథ్యంలో 12వ తరగతి ఫైనల్ ఫలితాలు వందశాతం వెల్లడికి, ఇంటర్నల్ మార్కుల అసెస్‌మెంట్‌కు ఛాన్స్ ఉండదని తెలిపింది. పరీక్షలకు ఇంటర్ సెకండియర్ కు 5,19,510 మంది హాజరవుతారని, అలాగే, ఇంటర్ ఫస్టియర్ కు 5,12,959 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొంది.
పరీక్షల సమయంలో ఒకరోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఉంటే, మరుసటి రోజు సెకండియర్ పరీక్ష ఉంటుందని చెప్పింది. కరోనా వేళ పరీక్ష హాలులో 15 నుంచి 18 మంది మాత్రమే విద్యార్థులను అనుమతిస్తున్నామని తెలిపింది. విద్యార్థుల మధ్య కనీసం ఐదు అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది.
విద్యార్థులు పరీక్ష రాసే గది వివరాలను కాలేజీ ప్రాంగణంలో పలుచోట్ల రాసి ఉంచుతామని పేర్కొంది. విద్యార్థులు ఒక్కచోట గుమికూడి చూసుకునే అసౌకర్యం ఉండదని తెలిపింది. అంతేగాక, పరీక్షకు ఒక రోజు ముందే ఆ వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. bei.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ ఈ వివరాలు తెలుసుకోవచ్చని తెలియజేసింది.
పరీక్ష కేంద్రం వద్ద వైద్యాధికారితో పాటు మెడికల్ కిట్ నూ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. కాలేజీలోకి వచ్చే మార్గం, పరీక్ష అనంతరం వెళ్లే మార్గం వేర్వేరుగా ఉంటాయని తెలిపింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం కోసం 50 వేల సిబ్బందిని నియమించామని చెప్పింది.