Brahmam gari matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేకాధికారి!
- వివాదానికి కేంద్ర బిందువుగా మారిన బ్రహ్మంగారి మఠం
- పీఠాధిపతి పదవి కోసం అంతర్గత కుమ్ములాట
- ఎంపిక ప్రక్రియ దేవాదాయ జాయింట్ కమిషనర్ అప్పగింత
ఎంతో ప్రఖ్యాతిగాంచిన పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం ఇటీవలి కాలంలో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పీఠాధిపతి పదవి కోసం కుటుంబసభ్యుల మధ్య అంతర్గతంగా జరుగుతున్న పోరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి చర్యలు చేపట్టారు.
పీఠాధిపతిని ఎంపిక చేసే ప్రక్రియను నిర్వహించేందుకు ప్రత్యేక అధికారిగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ ను నియమించారు. పీఠాధిపతి నియామకాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్తుకు వెల్లంపల్లి సూచించారు. ఈ నేపథ్యంలో పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ధార్మిక పరిషత్తు ఆదేశాలు జారీ చేసింది.