Nilam Sawhney: ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై వేసిన పిటిషన్ ఉపసంహరణ
- సుప్రీంకోర్టు ఉత్తర్వులను నీలం సాహ్ని అర్థం చేసుకోలేదంటూ పిటిషన్
- పూర్తి వివరాలు లేవంటూ హైకోర్టు అసహనం
- మరోసారి పిటిషన్ వేసేందుకు అనుమతించాలని కోరిన పిటిషనర్
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే పిల్ ను ఉపసంహరించుకుంటున్నట్టు పిటిషనర్ తరపు న్యాయవాది ఈరోజు హైకోర్టుకు తెలిపారు. దీంతో, పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా అర్థం చేసుకోకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నీలం సాహ్ని నిర్వహించారని... తద్వారా రూ. 160 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్ దాఖలైంది. ఆ సొమ్మును ఆమె నుంచే రాబట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు.
అయితే పూర్తి వివరాలు లేకుండానే పిల్ వేశారంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీంతో పూర్తి పత్రాలతో మరోసారి పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతించాలని పిటిషనర్ కోరారు. ఆయన అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.