Raghu Rama Krishna Raju: సీఎం జగన్ కు ఇవాళే మరో లేఖ రాసిన రఘురామకృష్ణరాజు... పరీక్షల అంశమే అజెండా

Raghurama Krishna Raju wrote another letter to CM Jagan

  • జస్టిస్ కనగరాజ్ అంశంలో నేడు ఓ లేఖ
  • బోర్డు పరీక్షలు వద్దంటూ సీఎంకు మరో లేఖ
  • సుప్రీంకోర్టును గౌరవించాలని హితవు
  • మంచి నాయకుడిగా చాటుకునేందుకు అవకాశమని వ్యాఖ్య  

పీసీఏ చైర్మన్ గా విశ్రాంత జడ్జి జస్టిస్ కనగరాజ్ ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ కు లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళే మరో లేఖాస్త్రం సంధించారు. ఈసారి రాష్ట్రంలో పరీక్షల అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాశారు. బోర్డు పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు చెప్పినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. పంతాలు, పట్టింపులకు పోకుండా తక్షణమే పరీక్షలు రద్దు చేయాలని, తద్వారా విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని సూచించారు.

పరీక్షల నిర్వహణ అంశంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సుప్రీంకోర్టు శంకించిందన్న విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. కొత్తగా కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పడం శోచనీయం అని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. పరీక్షలు రద్దు చేసినట్టు ప్రకటిస్తే సుప్రీంకోర్టుకు తగిన గౌరవం ఇచ్చిన వారవుతారని పేర్కొన్నారు. మంచి నాయకుడని నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం అని సీఎం జగన్ కు స్పష్టం చేశారు.

ఇప్పటికే దేశంలో 18 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని, ఆ రాష్ట్రాల బాటలో పయనిస్తే విద్యార్థుల భవిష్యత్ కాపాడిన వారవుతారని హితవు పలికారు.

  • Loading...

More Telugu News