Akula Agavva: వాసాలమర్రిలో 18 మందికి అస్వస్థత.. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడిన గ్రామస్థులు
- వాసాలమర్రిలో 2500 మందితో కలిసి కేసీఆర్ సహపంక్తి భోజనం
- వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరిన ఆగమ్మ
- ఆహారం కలుషితం కావడం కారణం కాదన్న వైద్యాధికారులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో మంగళవారం నిర్వహించిన సహపంక్తి భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సీఎం పక్కన కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సీఎం సభ అనంతరం వాంతులు చేసుకుంది. రాత్రి మరోమారు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు.
సహపంక్తిలో భోజనం చేసిన ఓ బాలిక బుధవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అదే రోజు డిశ్చార్జ్ చేశారు. అలాగే గ్రామానికి చెందిన మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు. విషయం తెలిసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని ఇంటింటికి తిరుగుతూ వైద్యం అందించారు. గ్రామస్థుల అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని అధికారులు తెలిపారు. సహపంక్తిలో మొత్తం 2500 మంది పాల్గొన్నారని, వారిలో 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు.