britain: ఇంకోసారి ఇలా చేస్తే మీ నౌకలపై బాంబులతో దాడి చేస్తాం: బ్రిటన్ కు రష్యా వార్నింగ్
- క్రిమియా తీరంలో బ్రిటిష్ నౌకాదళం చర్యలను ఉపేక్షించబోం
- ఇప్పటికే నౌక వెళ్తోన్న మార్గంపై బాంబులు వేశాం
- భవిష్యత్తులో నేరుగా నౌకపై వేస్తాం
క్రిమియా తీరంలో బ్రిటిష్ నౌకాదళం చర్యలను ఉపేక్షించబోమని రష్యా హెచ్చరించింది. ఇంకోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగితే నల్ల సముద్రంలోని బ్రిటిష్ నౌకలపై బాంబులతో దాడి చేస్తామని స్పష్టం చేసినట్లు చెప్పింది. బ్రిటన్‌కు చెందిన యుద్ధ నౌకలు తమ జలాల్లోకి వస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది.
మాస్కోలోని బ్రిటన్ రాయబారి దెబోరా బ్రెనెర్ట్‌కు ఈ విషయంపై రష్యా ఇప్పటికే సమన్లు జారీ చేసి వివరణ కోరింది. క్రిమియా తీరంలోని జలాలు తమ పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతుండగా, అవి ఉక్రెయిన్‌కు చెందిన జలాలని బ్రిటన్ తో పాటు అనేక దేశాలు స్పష్టం చేస్తున్నాయి.
దీంతో రష్యా పలు చర్యలు తీసుకుంటోంది. క్రిమియా జలాల్లోకి వచ్చిన బ్రిటిష్ నౌకను గుర్తించి హెచ్చరికలు చేస్తూ ఆ జలాల నుంచి తరిమేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే, దీనిపై యూకే మాత్రం మరోలా స్పందించింది. రష్యా ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని చెప్పింది.
దీనిపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జక్రోవా మీడియాతో మాట్లాడుతూ... బ్రిటన్ అబద్ధాలు చెబుతోందని, ఆ దేశం అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అన్నారు. బ్రిటన్ తన తీరును మార్చుకోకుండా మళ్లీ ఆ జలాల్లోకి నౌకలను పంపితే మాత్రం బాంబులేస్తామని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ రియాబ్‌కోవ్ హెచ్చరించారు.
ఇప్పటికే బ్రిటన్ యుద్ధనౌక వెళ్తోన్న మార్గంలో బాంబులేశారా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి అవుననే విధంగా ఆయన సమాధానం ఇవ్వడం గమనార్హం. తాము భవిష్యత్తులో ఇక నేరుగా తమ లక్ష్యంపైనే బాంబులు వేస్తామని స్పష్టం చేశారు. మధ్యధరా ప్రాంతంలో తమ ఆధిపత్యం కోసం రష్యా చాలా కాలంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందుకు నల్ల సముద్రం కీలకం.
దీంతో ఎన్నో ఏళ్లుగా బ్రిటన్‌తో పాటు టర్కీ, ఫ్రాన్స్, అమెరికా మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యా తన అధీనంలోకి తెచ్చుకోవడమే కాకుండా దాని చుట్టూ ఉండే జలాలు తమవిగా ప్రకటించుకుంది. మరోపక్క, క్రిమియా జలాల్లో పాశ్చాత్య దేశాల నౌకాదళ విన్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి.