KTR: గత ప్రభుత్వ హయాంలో పరిస్థితులు ఎలా ఉండేవి?: కేటీఆర్
- చెత్తను తీసుకెళ్లి ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ పడేసేవారు
- మైదానం, రోడ్డుపక్కన, చెరువుల్లో కుప్పలుగా వేసేవారు
- అక్టోబర్‌లో వర్షాలకు హైదరాబాద్‌లో ఇబ్బందులు పడ్డాం
- నాగోల్ లో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ఆధునిక ప్లాంట్ ప్రారంభిస్తున్నాం
దేశంలోనే ఐదో పెద్దదైన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ఆధునిక ప్లాంట్ ను హైదరాబాద్ శివారు నాగోల్ సమీపంలోని ఫతుల్లాగూడలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఏ విధమైన దుమ్ము ధూళిని బయటకు రానివ్వకుండా వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ సీ అండ్ డీ ప్లాంట్ నిర్వహణ ఉండనుంది. ఇది రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనుంది. నిన్నటివరకు న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం నగరాల్లో మాత్రమే ఈ భారీ ప్లాంట్లు ఉన్నాయి.
ఈ నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. మునిసిపల్ ఘనవ్యర్థాల నిర్వహణ విషయంలో అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
భవన నిర్మాణ వ్యర్థాల విషయంలోనూ ముందు జాగ్రత్త చర్యలతో ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మాత్రం చెత్తను తీసుకెళ్లి ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ పడేసేవారని ఆయన తెలిపారు. చెత్తను ట్రాక్టర్లలో తీసుకెళ్లి ఏదైనా మైదానం కనపడితే అక్కడే దాన్ని వేసే వారని విమర్శించారు.
అలాగే, రోడ్డుపక్కన లేదా చెరువుల్లో కుప్పకుప్పలుగా పడేసేవారని కేటీఆర్ తెలిపారు. దాని వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తేవని చెప్పారు. అక్టోబర్‌లో వర్షాలకు హైదరాబాద్‌లో ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రజలకు తెలుసని అన్నారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్, పునర్వినియోగం విషయంలో రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నామని చెప్పారు.
ఈ వ్యర్థాలను మళ్లీ వాడుకోవచ్చని, దీని వల్ల మన నగరంలో చెరువులు, కుంటలు పాడుకాకుండా కాపాడుకోవచ్చని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ఆధునిక ప్లాంట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని ప్లాంట్ల ఏర్పాట్లకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.