UFO: త్వరలో ఫ్లయింగ్ సాసర్ల గుట్టు విప్పనున్న అమెరికా!
- చాన్నాళ్లుగా మిస్టరీగా ఉన్న యూఎఫ్ఓలు
- కీలక సమాచారం సేకరించిన అమెరికా
- యూఎఫ్ఓలను చిత్రీకరించిన నేవీ పైలెట్లు
- ఈ నెలాఖరుకు నివేదిక విడుదల
ఎన్నో శతాబ్దాలుగా మానవాళికి ఫ్లయింగ్ సాసర్లు ఓ మిస్టరీగానే ఉన్నాయి. అందుకే ఇప్పటివరకు వాటిని గుర్తు తెలియని వస్తువులు (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్-యూఎఫ్ఓ)గా పిలుచుకుంటున్నాం. చాలాకాలంగా ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ల ఉనికిపై భిన్నవాదనలు ఉన్నాయి. వాటి ఫొటోలు తీశామని కొందరు చెబుతున్నా, ఆ ఫొటోలు అస్పష్టంగా ఉండడం, శాస్త్రీయంగా నిర్ధారణ కాకపోవడంతో వాటిని కట్టుకథల కింద కొట్టిపారేశారు.
అయితే, అమెరికా రక్షణ శాఖ మాత్రం ఈ యూఎఫ్ఓలపై చాన్నాళ్లుగా సమాచారం సేకరిస్తోంది. ఈ ఆధారాలను ఎంతో లోతుగా విశ్లేషించిన అమెరికా రక్షణ రంగ నిపుణులు ఓ నివేదిక రూపొందించారు. ప్రపంచ శాస్త్రవేత్తలతో పాటు ప్రజలకు కూడా ఎంతో ఆసక్తి కలిగిస్తున్న యూఎఫ్ఓలపై నివేదికను పెంటగాన్ వర్గాలు ఈ నెలాఖరుకు విడుదల చేయనున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లయింగ్ సాసర్లకు చెందిన ఈ రిపోర్టు అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ డైరెక్టర్ వద్ద ఉంది.
ఇటీవల కాలంలో అమెరికా నేవీ పైలెట్లు గగనతలంలో రికార్డు చేసిన అనేక వీడియో ఆధారాలు ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ వీడియోలపై క్షుణ్ణంగా పరిశోధన జరిపిన టాస్క్ ఫోర్స్ కూడా గుర్తు తెలియని విపరీత వస్తువులు ఆకాశంలో సంచరించడంపై ఓ నిర్ధారణకు వచ్చింది. అమితవేగంతో ప్రయాణించిన ఆ వస్తువులు, మానవ మేధకు అందని రీతిలో విన్యాసాలు చేయడం తాలూకు వీడియోలపై పెంటగాన్ సంతృప్తికరంగానే ఉంది. ఈ వీడియోలు నిజమైనవేనని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో, ఫ్లయింగ్ సాసర్లపై దశాబ్దాల తరబడి నెలకొన్న సందేహాలపై అమెరికా రక్షణ రంగ నివేదికతో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
దీనిపై పెంటగాన్ అధికార ప్రతినిధి స్యూ గాఫ్ మాట్లాడుతూ, అమెరికా గగనతలంలోకి ప్రవేశించే గుర్తించదగిన, గుర్తించలేని వస్తువులను దేన్నైనా తీవ్రంగానే పరిశోధిస్తామని వెల్లడించారు.
కాగా, జూన్ 3న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ నివేదికలోని అంశాలను ముందే ఓ కథనంలో వెల్లడించింది. యూఎఫ్ఓలు ఉన్నాయనేందుకు అమెరికా నిఘా వర్గాలు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పేర్కొంది.