Telangana: కేసీఆర్‌కు ఫోన్ చేసి రాయలసీమ ఎత్తిపోతలపై మాట్లాడిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్
- రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న కేసీఆర్
- ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తానని కేంద్రమంత్రి హామీ
- మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పర్యటనకు అధికారులు వెళ్తారన్న షెకావత్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిన్న ఫోన్ చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్జీటీ ఆదేశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రమంత్రికి కేసీఆర్ వివరించినట్టు సమాచారం. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని ఫిర్యాదు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చెప్పింది సావధానంగా విన్న గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు మరో రెండు రోజుల్లో అధికారులు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తారని కేసీఆర్‌కు కేంద్రమంత్రి తెలిపారు.