Uttar Pradesh: మాస్కు ధరించకుండా బ్యాంకులోకి కస్టమర్.. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు
- యూపీలోని బరేలీలో ఘటన
- రెచ్చిపోయి కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు
- పోలీసుల అదుపులో నిందితుడు
మాస్కు ధరించకుండా బ్యాంకులోకి వెళ్లిన ఖాతాదారుడిపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో జరిగింది. బాధితుడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం.. రాజేశ్ అనే ఖాతాదారుడు భార్య ప్రియాంకతో కలిసి స్థానిక జంక్షన్ రోడ్డులో ఉన్న బరోడా బ్యాంకుకు వెళ్లాడు. అతడు ముఖానికి మాస్క్ ధరించకపోవడంతో సెక్యూరిటీగార్డు కేశవ్ అడ్డుకుని మాస్కు ధరించాలని సూచించాడు. దీంతో మాస్కు ధరించి లోపలికి వెళ్తుండగా మరోమారు అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు ఇది భోజన సమయమని, లోపలికి అనుమతి లేదని చెప్పాడు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కోపోద్రిక్తుడైన సెక్యూరిటీగార్డు రాజేశ్‌పై తుపాకితో కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న భర్త వద్ద భార్య ప్రియాంక రోదిస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డు కూడా వీడియోలో కనిపించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కేశవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.