Randeep Guleria: రెండు వ్యాక్సిన్లు కలిపి ఇస్తే ఇమ్యూనిటీ పెరగొచ్చేమో... అయితే మరింత సమాచారం అవసరం: ఎయిమ్స్ చీఫ్
- వ్యాక్సిన్ కాంబినేషన్ పై గులేరియా వ్యాఖ్యలు
- ఇమ్యూనిటీ, యాంటీబాడీలపై వివరణ
- కొద్దిపాటి సమాచారం అందుబాటులో ఉందని వెల్లడి
- భవిష్యత్తులో ఇదొక పరిశీలనాంశం అని ఉద్ఘాటన
రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ఒకదానితో ఒకటి కలిపి ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన రోగనిరోధక శక్తి సాధ్యమవుతుందని, అధిక సంఖ్యలో యాంటీబాడీలు తయారవుతాయన్నదానిపై కొంత సమాచారం అందుబాటులో ఉందని, అయితే దీనిపై మరింత సమాచారం అవసరమని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు ఓ ప్రధాన టీకా, దాన్ని అనుసరిస్తూ ఓ బూస్టర్ డోసు వేసే విధానం అమల్లో ఉందని తెలిపారు. కొత్తగా ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్లను ఒకదానితో ఒకటి కలిపి ఇస్తే కాస్త అధికమోతాదులోనే దుష్పరిణామాలు కలగొచ్చన్నది ఒక వాదన అని, ఇమ్యూనిటీ రెట్టింపవుతుందని, యాంటీబాడీలు పుష్కలంగా తయారవుతాయన్నది మరొక వాదన అని గులేరియా వివరించారు. అయితే ఈ అంశాలను నిర్ధారించేందుకు మరింత డేటా అవసరం అని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వి, జైడస్ కాడిలా వంటి అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని, వీటిలో ఏ కాంబినేషన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందన్నది ఇప్పుడున్న సమాచారంతో చెప్పలేమని అన్నారు. ప్రాథమికంగా కొన్ని అధ్యయనాలను చూస్తే... రెండు రకాల కొవిడ్ వ్యాక్సిన్లను కలిపి ఇవ్వడం కూడా పరిశీలించదగ్గ అంశమని సూచిస్తున్నాయని గులేరియా వెల్లడించారు.