Narendra Modi: కరోనా వ్యాక్సిన్‌ను తిరస్కరించడం చాలా ప్రమాదం: మోదీ
- వ్యాక్సిన్లపై భయాన్ని వదులుకోవాలి
- కరోనా సోకితే మనకే కాకుండా మన కుటుంబ సభ్యులకూ ప్రమాదం
- కొన్ని గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
కరోనాతో దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆయన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ... కరోనాపై కలిసికట్టుగా పోరాడుతూ ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. వ్యాక్సిన్లపై భయాన్ని వదులుకోవాలని ఆయన కోరారు.
వ్యాక్సిన్ వేయించుకుంటే కొందరికి కొన్ని గంటల పాటు సాధారణ జ్వరం రావచ్చని, అనంతరం అది కూడా ఉండదని మోదీ చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ను తిరస్కరించడం చాలా ప్రమాదకరమని తెలిపారు. మనకు కరోనా సోకితే మనకే కాకుండా మన కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు కూడా ప్రమాదమని చెప్పారు. దేశంలోని చాలా గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆ క్రీడల గురించి మనం మాట్లాడుకుంటున్నామని మోదీ చెప్పారు. ఈ సమయంలో అథ్లెట్ మిల్కా సింగ్‌ను గుర్తు చేసుకోకుండా ఉండలేమని తెలిపారు. కొవిడ్‌పై పోరాడుతూ మిల్కా సింగ్ ప్రాణాలు కోల్పోయారని, దీంతో దేశం ఆయనను కోల్పోయిందని వ్యాఖ్యానించారు.
ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో తాను ఆయనతో మాట్లాడానని మోదీ చెప్పారు. 1964 టోక్యో ఒలింపిక్స్ గురించి ప్రస్తావించానని తెలిపారు. క్రీడలకే తన జీవితాన్ని అంకితమిస్తూ మిల్కా స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.