Andhra Pradesh: కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు
- పలు మండలాల్లో భారీ వరద
- మునిగిన పంట పొలాలు
- పలు చోట్ల రాకపోకలు బంద్
- జలమయమైన కొన్ని కాలనీలు
కర్నూలు జిల్లాలో వర్షం జోరుగా కురుస్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. పంట పొలాలు నీట మునిగాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కౌతాళం, నందవరం, కోసిగి, కోడుమూరు, పెద్దకడుబూరు, బండి ఆత్మకూరు, సున్నిపెంట, సి బెళగల్, ఆస్పరి, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల మండలాల్లో వర్షం కురుస్తోంది. కోడుమూరు మండలంలోని వర్కూరు వద్ద తుమ్మలవాగు, పెంచికలపాడు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తుమ్మలవాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ల లారీ డ్రైవర్ ను స్థానికులు కాపాడారు.
ఇక, కోడుమూరు పట్టణంలోకి కూడా వరద భారీగా వచ్చి చేరింది. భారీ వరద కారంణంగా కర్నూలు–ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. నందవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు ప్రవేశించింది. పెద్దకొత్తిలి వాగు ఉప్పొంగడంలో అక్కడి పొలాలను వరద ముంచెత్తింది.