Netaji Subhash Chandra Bose: నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోపీ భద్రంగానే ఉందన్న కేంద్రం
- 2019లో కేంద్రానికి నేతాజీ టోపీని అందించిన వారసులు
- ‘నేతాజీ క్యాప్ మిస్సింగ్’ అంటూ చంద్రకుమార్ బోస్ ట్వీట్
- కోల్‌కతాకు పంపించామన్న కేంద్రం
తాము బహూకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోపీని అన్ని చోట్లకు తరలించడం సరికాదని, దానిని ఎర్రకోటలోనే భద్రంగా ఉంచాలన్న నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ ట్వీట్‌పై కేంద్రం స్పందించింది. ఆ టోపీ భద్రంగానే ఉందని, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో ప్రత్యేక దర్శనం కోసం తరలించామని పేర్కొంది.
ఢిల్లీలోని ఎర్రకోటలో 2019లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం ఏర్పాటు చేసిన మ్యూజియానికి నేతాజీ వినియోగించిన టోపీని ఆయన వారసులు అందించారు. ఈ ఏడాది జనవరిలో ఆ టోపీని కోల్‌కతాకు తరలించారు. టోపీని తరలించడంపై చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దానిని ఎర్రకోటలోనే భద్రపరచాలని కోరుతూ ‘నేతాజీ క్యాప్ మిస్సింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్.. నేతాజీ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ప్రదర్శన కోసమే టోపీని తరలించినట్టు చెప్పారు. జులై 18 తర్వాత తిరిగి ఎర్రకోటకు తీసుకొచ్చి భద్రపరుస్తామని పేర్కొన్నారు.