Imran Khan: హాలీవుడ్, బాలీవుడ్లు పాకిస్థాన్ ను నాశనం చేస్తున్నాయి: ఇమ్రాన్ ఖాన్
- హాలీవుడ్ లో విపరీతమైన అశ్లీలత ఉంది
- అది క్రమంగా బాలీవుడ్ కు పాకుతోంది
- కురచ దుస్తుల ప్రభావం మగాళ్లపై కచ్చితంగా పడుతుంది
బాలీవుడ్, హాలీవుడ్ సినీ రంగాలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. శరీరం కనిపించేలా కురచ దుస్తులను ధరిస్తుండటం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే చర్చ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇమ్రాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సినీ ఇండస్ట్రీలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని దుయ్యబట్టారు. వీటి వల్ల పాకిస్థాన్ లో కూడా అశ్లీలత పెరిగిపోతోందని అన్నారు. ఇస్లామాబాద్ లో జరిగిన నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆలోచనలు సరికొత్త పంథాలో ఉన్నప్పటికీ... దానికి సహజత్వం ఉండాలని ఇమ్రాన్ అన్నారు. హాలీవుడ్ లో విపరీతమైన అశ్లీలత ఉందని, అది క్రమంగా బాలీవుడ్ కు పాకుతోందని చెప్పారు. ఆ రెండు సినీ రంగాలు పాకిస్థాన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని మండిపడ్డారు. మహిళలు కురచ దుస్తులు ధరిస్తే, దాని ప్రభావం రోబోలపై పడకపోవచ్చేమోగాని, మగాళ్లపై కచ్చితంగా పడుతుందని అన్నారు.