Shivathmika: దూకుడు పెంచుతున్న 'దొరసాని'
- 'దొరసాని' సినిమాతో మంచి పేరు
- 'రంగమార్తాండ'లోను ఛాన్స్
- తమిళంలో రెండు సినిమాలు
తెలుగు తెరకి 'దొరసాని' సినిమా ద్వారా రాజశేఖర్ కూతురు 'శివాత్మిక' పరిచయమైంది. తొలి సినిమానే అయినా ఎక్కడా తడబాటు కనిపించనీయకుండా చాలా బాగా చేసింది. 'చిన దొరసాని' పాత్రలో సహజమైన ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 'గడీ'ల నేపథ్యంలో నడిచే ఓ పల్లెటూరి ప్రేమకథగా వచ్చిన ఆ సినిమా, యూత్ ను బాగానే కట్టుకుంది. ఆ తరువాత శివాత్మిక వరుస సినిమాలు చేస్తుందనే అంతా అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. మంచి కథలు .. పాత్రల కోసం వెయిట్ చేస్తూ ఉండటంతో గ్యాప్ వచ్చేసింది.
అలాంటి శివాత్మిక 'రంగమార్తాండ' సినిమాతోనే మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. అయితే తమిళంలో ఆమె తన దూకుడు పెంచాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తమిళంలో ఆమె 'ఆనందం విలయాడుమ్ వీడు' అనే సినిమా చేసింది. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కాకముందే శివాత్మిక మరో తమిళ సినిమాకి సైన్ చేసిందని అంటున్నారు. ఆర్. కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. ఇక తమిళంలో ఆమె మరికొన్ని కథలను వింటున్నట్టుగా చెబుతున్నారు.