Seethakka: పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడొద్దు: కోమటిరెడ్డికి సీతక్క కౌంటర్
- అధికారాన్ని అనుభవించడానికి మేము పార్టీలోకి రాలేదు
- రేవంత్ అన్నను పీసీసీ ప్రెసిడెంట్ చేయడం సంతోషకరం
- కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం
రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కోమటిరెడ్డి వంటి అగ్రనేతలు బహిరంగంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క కౌంటర్ ఇచ్చారు. అధికారాన్ని అనుభవించడానికి తాము కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీలో చేరామని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని... పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడవద్దని సూచించారు.
రేవంత్ అన్నకు పెద్ద పదవి వచ్చిందనే సంతోషం ఉందని... ఇదే సమయంలో తమపై బాధ్యత పెరిగిందని సీతక్క అన్నారు. పార్టీని నడిపించే బాధ్యత రేవంత్ అన్నపై ఉందని పార్టీకి చెందిన ఎందరో నేతలు, కార్యకర్తలు అంటున్నారని చెప్పారు. అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే రేవంత్ రెడ్డికి పీసీపీ పదవిని ఇవ్వడం జరిగిందని అన్నారు. పీసీపీ పదవిపై అధిష్ఠానం ఎన్నో రోజులు చర్చలు జరిపిందని, చివరకు రేవంత్ ను ఎంపిక చేసిందని తెలిపారు. రేవంత్ అన్న సారధ్యంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి, ప్రజల సమస్యలను తీర్చినప్పుడే తమకు ఆనందం కలుగుతుందని చెప్పారు.