Telangana: దళితుల భూములు దొరల పాలవుతున్నాయి: సర్కార్ పై ఈటల రాజేందర్ మండిపాటు
- మరోసారి వారిని మోసం చేసే ప్రయత్నం
- రెవెన్యూ సంస్కరణలతో దళితులకు దగా
- మభ్యపెట్టి గెలవడమే టీఆర్ఎస్ కు తెలుసు
- వారి నిధులు వేరే పథకాలకు మళ్లింపు
రాష్ట్రంలో దళితులను రాష్ట్ర సర్కారు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఎస్సీలకు కేటాయిస్తున్న నిధులను ఎన్నో ఏళ్లుగా వేరే పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. పదవి దక్కడానికి కారణమైన వారిని అగౌరవపరచొద్దని ఆయన సూచించారు. అందరికీ అందుతున్న పథకాలే ఎస్సీలకూ అందుతున్నాయన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవడమే టీఆర్ఎస్ కు తెలుసన్నారు. ఇవ్వాళ ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఏడేళ్లలో దళితులకు ఎంతో చేసి ఉండొచ్చని విమర్శించారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు పాస్ పుస్తకాలు రాక ఎందరో దళితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఓ తెల్లకాగితంపై రాసుకుని వారు కొనుగోలు చేసిన భూములు ఇప్పుడు దొరల పాలవుతున్నాయని మండిపడ్డారు. రెవెన్యూ సంస్కరణలు దళితులను దగా చేశాయన్నారు.
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లోనే డబుల్ బెడ్రూం ఇళ్లు దక్కుతున్నాయని, హుజూరాబాద్ సహా చాలా చోట్ల పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ తో లాభపడిన కాంట్రాక్టర్లే కొన్ని చోట్ల ఇళ్లను పూర్తి చేశారన్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కొందరు పోలీసులు చట్టానికి లోబడి కాకుండా.. చుట్టాలకు లోబడి పనిచేస్తున్నారని ఈటల విమర్శించారు.