Balakrishna: బసవతారకం ఆసుపత్రిపై నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు... బాలకృష్ణ స్పందన
- నీతి ఆయోగ్ నివేదికలో బసవతారకం ఆసుపత్రి ప్రస్తావన
- లాభాపేక్ష లేకుండా సేవలు చేస్తున్నారని కితాబు
- హర్షం వ్యక్తం చేసిన బాలయ్య
- తండ్రి దార్శనికతను గుర్తుచేసుకున్న వైనం
- అందరి వల్ల ఇది సాధ్యమైందని వ్యాఖ్య
హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తో పాటు పుట్టపర్తిలోని సత్యసాయి ఆసుపత్రులు లాభాపేక్ష చూసుకోవని, పేద ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్నాయని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. దీనిపై బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ స్పందించారు. దేశ అత్యున్నత ప్రణాళిక వ్యవస్థ నీతి ఆయోగ్ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని గుర్తించిందని చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. దేశంలోని అత్యుత్తమ ప్రైవేటు ట్రస్ట్ ఆసుపత్రిగా నీతి ఆయోగ్ పేర్కొందని వెల్లడించారు.
ఈ ఘనత అంతా తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావుకే చెందుతుందని బాలయ్య వినమ్రంగా తెలిపారు. పేదలకు సముచిత ధరలో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్స అందాలన్న తన తండ్రి దార్శనికత వల్లే నేడు ఈ గుర్తింపు లభించిందని వివరించారు. ట్రస్టు సభ్యులు, పెద్ద మనసు చూపుతున్న దాతలు, యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది తన తండ్రి ఆశయాన్ని నిజం చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.