RDS: ఆర్డీఎస్ పనులు అడ్డుకోవాలంటూ కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
- ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం పునర్విభజన చట్టానికి వ్యతిరేకం
- కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండానే నిర్మాణం
- నిర్మాణ పనుల ఫొటోలను లేఖకు జత చేసిన తెలంగాణ
నీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య మొదలైన వివాదం కొనసాగుతోంది. తాజాగా ఏపీ నిర్మిస్తున్న ఆర్డీఎస్ నిర్మాణం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని, వెంటనే వాటిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు.
కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 నిర్ణయాన్ని కేంద్రం ఇంకా నోటిఫై చేయలేదని, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకపోయినా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని ఆ లేఖలో ఆరోపించారు. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులు జరుగుతున్న ఫొటోలను ఈ లేఖకు జతచేశారు. దీనివల్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, కాబట్టి వెంటనే పనులను నిలిపివేయాలని కోరారు.