Wimbledon: వింబుల్డన్ లో ఫెదరర్ లో తగ్గని సత్తా... సానియా మీర్జా జోడి సంచలన విజయం!

Federer in To Third Round and Sania Mirza in Second Round in Wimbledon
  • మూడో రౌండ్ కు దూసుకెళ్లిన ఫెదరర్
  • ఆరో సీడ్ జోడీని ఓడించిన సానియా జంట
  • తొలి రౌండ్ లోనే నిష్క్రమించిన బొపన్న- దివిజ్ శరణ్ జంట
వింబుల్డన్ లో ఎన్నో విజయాలు సాధించి, మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలవడమే లక్ష్యంగా ఈ దఫా బరిలోకి దిగిన స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, తనలో ఎంతమాత్రమూ సత్తా తగ్గలేదని నిరూపిస్తూ, మూడవ రౌండ్ లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో ఆరవ సీడ్ గా బరిలోకి దిగిన ఫెదరర్, రెండో రౌండ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ కు చెందిన రిచర్డ్ గ్యాస్కట్ తో తలపడి గెలిచాడు. మూడు వరుస సెట్లలో 7-6(1), 6-1, 6-4 తేడాతో ఫెదరర్ గెలవడం గమనార్హం.

మరో మ్యాచ్ లో రెండో సీడ్ మెద్వదేవ్, స్పెయిన్ కు చెందిన అల్కర్జ్ గార్ఫియాపై పోటీ పడి, 6-4, 6-1, 6-2 తేడాతో గెలిచాడు. మహిళల సింగిల్స్ విషయానికి వస్తే, ఇప్పటికే పలువురు టాప్ సీడ్స్ వైదొలగగా, మూడో సీడ్ గా బరిలోకి దిగిన స్వితోలినా కూడా అదే దారిలో నడిచింది. పోలెండ్ కు చెందిన మగ్దా లిన్నెట్టితో పోటీ పడిన ఆమె 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది. బ్లింకోవాపై బార్టీ 6-4, 6-3 తేడాతో గెలువగా, 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవా 6-2, 6-2 తేడాతో డోనా వికిక్ పై విజయం సాధించింది.

మహిళల డబుల్స్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ సంచలన విజయాన్ని సాధించింది. అమెరికన్ క్రీడాకారిణి బెథానీ మాటెక్ శాండ్స్ తో కలిసి వింబుల్డన్ లో ఆడుతున్న సానియా, తొలి రౌండ్ లో ఆరో సీడ్ గా బరిలోకి దిగిన యూఎస్ - చిలీ జోడి డెసిరె క్రాజక్ - అలెక్సా గురాచీతో పోటీ పడిన సానియా జంట 7-5, 6-3 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లింది. ఇంకో మ్యాచ్ లో లారెన్ డెవిస్ తో కలసి బరిలోకి దిగిన అంకిత రైనా తొలి రౌండ్ లోనే ఓడిపోయింది.

పురుషుల డబుల్స్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీ ఓటమి పాలైంది. ఎడ్వర్డో రోజర్, హెన్రీ కాంటినెన్ జంటతో పోటీ పడిన బొపన్న జోడీ 6-7 (6), 4-6 తేడాతో ఓడిపోయింది.
Wimbledon
Sania Mirza
Rozer Federer
Rohan Boppanna

More Telugu News