Andhra Pradesh: తెలంగాణ ఈపాస్ నిబంధనలపై ఏపీ విద్యార్థి పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు
- హైదరాబాదుకు వెళ్లడానికి ఈపాస్ అవసరం లేదంటూ ఏపీ విద్యార్థి పిటిషన్
- పిటిషనర్ పునర్విభజన చట్టం సెక్షన్-5 వద్దే నిలిచిపోయారన్న సుప్రీం
- పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం
కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈపాస్ లేనిదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని అనుమతించడం లేదు. ఏపీ నుంచి హైదరాబాదుకు వచ్చే వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈపాస్ ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరికాదంటూ కృష్ణా జిల్లాకు చెందిన న్యాయ విద్యార్థి క్రాంతి కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాదును ఏపీ రాజధానిగా పేర్కొనకూడదని న్యాయస్థానం సూచించింది. ఈపాస్ కు సంబంధించిన నోటిఫికేషన్ తాత్కాలికమైనదని... ఇప్పుడు దాని గడువు పూర్తయినందువల్ల పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని చెప్పింది. పిటిషనర్ ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్-5 వద్దే నిలిచిపోయారని వ్యాఖ్యానించింది. నోయిడా నుంచి పక్కనే ఉన్న ఘజియాబాద్ కు వెళ్లాలంటే ఢిల్లీ ప్రభుత్వానికి ఈపాస్ కోసం దరఖాస్తు చేయాల్సిందే కదా? అని సుప్రీం గుర్తు చేసింది.
ఢిల్లీ పరిస్థితులు వేరంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వ్యాఖ్యానించగా... ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులు కూడా ఈపాస్ లు తీసుకుంటున్నారంటూ పిటిషన్ ను కొట్టివేసింది. ఈపాస్ అనేది జాతీయ విపత్తు చట్టం ప్రకారం జారీ చేసినదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ రామసుబ్రమణియన్ బెంచ్ విచారించింది.