Sajjala Ramakrishna Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుకు జగన్ సహకరించారు.... ఇప్పుడు పరిస్థితులు ఎందుకు మారాయో అర్థం కావడంలేదు: సజ్జల
- తెలుగు రాష్ట్రాల జల వివాదాలు తీవ్రతరం
- మోదీకి లేఖ రాసిన సీఎం జగన్
- వివరణ ఇచ్చిన సజ్జల
- కేఆర్ఎంబీ చెప్పినా తెలంగాణ వినడంలేదని ఆరోపణ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం జగన్ సహకరించారని, ఇప్పుడెందుకు పరిస్థితులు మారాయో అర్థం కావడంలేదని అన్నారు. అంతేకాదు, సీఎం జగన్ తో సమావేశమైన సందర్భంగా, రాయలసీమకు నీరు అందించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారని, రాయలసీమ ప్రయోజనాల విషయంలో పెద్దన్నగా వ్యవహరిస్తానని కూడా చెప్పారని సజ్జల వెల్లడించారు. నాడు ఇరువురు సీఎంల మధ్య జరిగిన సమావేశంలో తాను కూడా ఉన్నానని తెలిపారు.
తక్కువ వ్యవధిలో ఎక్కువ నీటిని తీసుకోవాలన్న ఉద్దేశంతోనే రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. అయితే, 800 అడుగుల లోతు నుంచి కృష్ణా నది నీటిని తీసుకోవడం పట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆరోపించారు. అయితే, తెలంగాణ నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేస్తోందని, ఇది ఏపీకి నష్టం కలిగించే అంశమని సజ్జల పేర్కొన్నారు.
ఉభయ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చెప్పినా తెలంగాణ పట్టించుకోవడంలేదని, అందుకే సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. సమస్యను వివాద రహితంగా పరిష్కరించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారని వెల్లడించారు.