Rajamouli: రాజమౌళి ట్వీట్ పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఢిల్లీ ఎయిర్ పోర్టు యాజమాన్యం
- లుఫ్తాన్సా విమానంలో ఢిల్లీ చేరుకున్న రాజమౌళి
- ఆర్టీ-పీసీఆర్ ఫారంలు ఇచ్చిన అధికారులు
- టేబుళ్లు దొరక్క జక్కన్న ఇబ్బంది
- తన అసౌకర్యాన్ని వివరిస్తూ ట్వీట్
- డెస్కులు ఉన్నాయన్న ఢిల్లీ ఎయిర్ పోర్టు
- వాటి సంఖ్యను ఇంకా పెంచుతామని వెల్లడి
విదేశాల నుంచి వస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి తనకు, ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల ట్విట్టర్ లో అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ ఎయిర్ పోర్టు యాజమాన్యం స్పందించింది. 'మీ విలువైన ఫీడ్ బ్యాక్ అందించినందుకు కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. విమానాశ్రయంలోని సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు మీ సూచనలు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొంది.
ఆర్టీ-పీసీఆర్ సంబంధిత విషయాలకు డెస్కులు ఉన్నాయని, అయితే వాటి సంఖ్యను మరింత పెంచుతామని, ప్రజలకు ఈ విషయం తెలిసేలా విమానాశ్రయంలోని ఇతర ప్రాంతాల్లోనూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని ఎయిర్ పోర్టు మేనేజ్ మెంట్ వెల్లడించింది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభూతి కలిగించేందుకు కృషి చేస్తామని, తమ బృందం వెంటనే చర్యలు తీసుకుంటుందని వివరించింది.