India: మహిళా క్రికెట్ లో అరుదైన రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్!
- అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు
- ప్రస్తుతం ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న మహిళల జట్టు
- తాజా మ్యాచ్ లో రికార్డు సాధించిన మిథాలీ
భారత మహిళా క్రికెట్ స్టార్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డును సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె నిలవడం ద్వారా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్టీ ఎడ్ వర్డ్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. మహిళల ఇంటర్నేషనల్ పోటీల్లో ఎడ్ వర్డ్స్ 10,273 పరుగులు చేయగా, తన తాజా మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా మిథాలీ ఆ రికార్డును దాటేసింది.
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తాజా మ్యాచ్ లో మిథాలీ ఈ రికార్డును అధిగమించింది. వర్షం కారణంగా కొంతమేరకు అవాంతరాలు ఏర్పడిన మ్యాచ్ ని 47 ఓవర్లకు కుదించగా, ఇంగ్లండ్ విధించిన 220 పరుగుల టార్గెట్ ను భారత్ ఛేదించింది.
మ్యాచ్ మధ్యలో అవుట్ కాకూడదని, ఈ గేమ్ లో గెలిచి తీరాలని, చివరి వరకూ పోరాడాలని తాను భావించానని మ్యాచ్ అనంతరం మిథాలీ వెల్లడించింది. ఛేజింగ్ తనకు ఇష్టమని, టీమ్ కోసం మ్యాచ్ ని గెలవడమే లక్ష్యంగా ఆడానని మిథాలీ పేర్కొంది. కాగా, మిథాలీ రాజ్ సాధించిన ఈ విజయం, ఆపై దక్కిన అత్యధిక పరుగుల రికార్డుపై పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు.