Bandi Sanjay: నదీ జలాలను న్యాయంగా వాడుకోవాలని జగన్ కు కేసీఆర్ చెప్పారు: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి
- తెలంగాణ హక్కులను కేంద్ర సర్కారుకి అప్పజెప్పాలన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు
- రాజకీయాలు మాని ప్రభుత్వ చర్యలకు మద్దతు పలకాలి
- కేంద్ర సర్కారు వివాదంపై పట్టించుకోవట్లేదు
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం రాజుకున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తోన్న వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ హక్కులను కేంద్ర సర్కారుకి అప్పజెప్పాలన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. బండి సంజయ్‌కి ఆ జలాలపై అవగాహన లేదని చెప్పారు. రాజకీయాలు మాని ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికి కలిసి రావాలని ప్రతిపక్షాలకు ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నప్పటికీ కేంద్ర సర్కారు పట్టించుకోవట్లేదని ఆయన విమర్శించారు. నదీ జలాలను న్యాయంగా వాడుకోవాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌కి తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. కృష్ణా నదిపై గత అనుమతులతోనే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఆయన అన్నారు.
గత తెలంగాణ పాలకులకు ఆయా ప్రాజెక్టులపై అవగాహన లేక ఎన్నో ఏళ్లుగా ఆంధ్రాకు లాభం చేకూర్చారని ఆయన చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. జగన్‌కి నీళ్ల విషయంలో స్పష్టత అవసరమని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. నదీ జలాల వృథా నీటిని పద్ధతిగా వాడుకుందామని అన్నారని చెప్పారు.