Nara Lokesh: రెండేళ్లలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదు: నారా లోకేశ్

Nara Lokesh furious on AP Govt over unemployment in state

  • కర్నూలు జిల్లాలో గోపాల్ అనే యువకుడి ఆత్మహత్య
  • తనను కలచివేసిందన్న లోకేశ్
  • ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
  • లేకపోతే తాను పోరాటం చేస్తానని వెల్లడి

రాష్ట్రంలో నిరుద్యోగిత ప్రబలిపోతోందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తామంటూ ఆశపెట్టి, ఇప్పుడు మాటతప్పారని, తద్వారా నిరుద్యోగ యువతను బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు.

తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు స్తోమత లేకపోయినా రెక్కల కష్టంతో గోపాల్ ను ఉన్నత చదువులు చదివించారని తెలిపారు. రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన గోపాల్, తనకు ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.

తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే ఇతర కుటుంబానికి జరగకుండా పోరాటం చేయాలని గోపాల్ తమ్ముడు శ్రీనివాసులు రాసిన లేఖ తనకు అందిందని లోకేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులుకు లోకేశ్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు.

"మీ కుటుంబం పడుతున్న వేదనను నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే నేను చనుగొండ్ల గ్రామానికి వచ్చి మీ అమ్మానాన్నలను కలుస్తాను. మీ కుటుంబానికి కలిగిన శోకం రాష్ట్రంలో మరే కుటుంబానికి కలగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ముందుండి పోరాటాన్ని నడిపిస్తాను. ఇచ్చిన హామీ మేరకు జగన్ 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసేంతవరకు నా పోరాటం ఆగదు" అంటూ లోకేశ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News