Mohan Bhagwat: ప్రజాస్వామ్యంలో ఏ మతం ఆధిపత్యం ఆమోదయోగ్యం కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

RSS Chief Mohan Bhagwat calls for religious harmony
  • ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్
  • మత సామరస్యంపై అభిప్రాయాల వెల్లడి
  • భారతీయత ఒక్కటే ముఖ్యమని వ్యాఖ్యలు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆర్ఎస్ఎస్ కు చెందిన ముస్లిం విభాగం. ఇక ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత సామరస్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ... ఏ మతం అయినా ఆధిపత్యం ప్రదర్శించడం భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.

దేశంలో ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. జాతీయతకు ప్రాతిపదిక ఐక్యతేనని, పూర్వీకుల నుంచి అందిపుచ్చుకోవాల్సిన ఘనత అదేనని స్పష్టం చేశారు. దేశంలో ఆధిపత్యం అంటూ ఉంటే అది భారతీయత మాత్రమే అయ్యుండాలని, హిందూ మతమో, ముస్లిం మతమో పైచేయిగా ఉండడం సరికాదని మోహన్ భగవత్ వివరించారు.

కొందరు వ్యక్తులపై సామూహికంగా దాడి చేసి హతమార్చిన ఘటనలపై స్పందిస్తూ, అలాంటి హింసాత్మక ఘటనలు హిందుత్వకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. గోవు మనకు పవిత్రం కావొచ్చేమో కానీ, ఇలాంటి మూకదాడులకు హిందుత్వంలో తావులేదని అన్నారు. ఇక్కడ ఓ ముస్లిం నివసించరాదని ఓ హిందువు చెప్పాడంటే అతడు నిజమైన హిందువు కానట్టేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
RSS
Muslim
Hindu
Muslim Rashtriya Manch
India

More Telugu News