MK Varghese: పోలీసులు తనకు సెల్యూట్ చేయడం లేదని ఓ మేయర్ ఆవేదన!

Trissur mayor complains to DGP over protocol issue
  • డీజీపీకి ఫిర్యాదు చేసిన త్రిస్సూర్ మేయర్ 
  • తనను పోలీసులు పట్టించుకోవడంలేదని ఫిర్యాదు
  • ప్రోటోకాల్ పాటించరా? అంటూ వ్యాఖ్యలు 
  • గవర్నర్, సీఎం తర్వాత మేయరేనని వెల్లడి
ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార యంత్రాంగం మధ్య ప్రోటోకాల్ నిబంధనలు ఎంతో కీలకం. అయితే, పోలీసులు తనను గౌరవించడంలేదంటూ కేరళలోని త్రిస్సూర్ నగర మేయర్ ఎంకే వర్గీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తనను చూసి కూడా సెల్యూట్ చేయడంలేదని వర్గీస్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన కేరళ పోలీసు బాస్ అనిల్ కాంత్ కు ఫిర్యాదు చేశారు.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను వాహనంలో వెళుతుండగా, పోలీసులు తనను గుర్తించి కూడా సెల్యూట్ చేయలేదని వర్గీస్ వాపోయారు. తాను వ్యక్తిగత సెల్యూట్ కోరుకోవడంలేదని, తన పదవిని గుర్తించి గౌరవించాలని కోరుతున్నానని వెల్లడించారు. కార్పొరేషన్ పరిధిలో ప్రోటోకాల్ పరిశీలిస్తే... గవర్నర్, సీఎం తర్వాత స్థానంలో మేయర్ ఉంటారని వర్గీస్ వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సెల్యూట్ కొడుతున్న పోలీసులు, తనను పట్టించుకోకపోవడం గర్హనీయం అని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ అనిల్ కాంత్ ను కోరారు.

ఈ అంశంపై కేరళ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. ఎవరికి సెల్యూట్ చేయాలో పోలీసులకు తెలుసని సంఘం నేతలు వెల్లడించారు. చట్టబద్ధంగా అర్హులైన వారికే పోలీసులు సెల్యూట్ చేస్తారని వివరించారు. పోలీసు విధివిధానాల్లో కూడా సెల్యూట్ ఎవరికి చేయాలన్న దానిపై స్పష్టత ఉందని తెలిపారు. కాగా, మేయర్ ఫిర్యాదుపై డీజీపీ స్పందించడమే కాకుండా, విచారణకు ఆదేశించారు.
MK Varghese
Mayor
Trissur
Salute
Police
Protocol
Kerala

More Telugu News