Kerala: జాక్‌పాట్ అంటే ఇదే.. అబుదాబిలో కేరళ డ్రైవర్‌కు లాటరీలో రూ. 40 కోట్లు!
- 2008 నుంచి అబుదాబిలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సోమరాజన్
- సహచరులు 9 మందితో కలిసి లాటరీ టికెట్ కొనుగోలు
- వచ్చే మొత్తాన్ని సమానంగా పంచుకుంటామన్న కేరళ వాసి
జాక్‌పాట్ అంటే ఇలా ఉండాలి మరి. అబుదాబిలో 2008 నుంచి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళ వ్యక్తి ఒకరు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ. 40 కోట్ల జాక్‌పాట్ తగిలింది. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోతున్నాడు.
టాక్సీ డ్రైవర్ అయిన 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్‌కు 3 కోట్ల దిర్హమ్లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి ఉప్పొంగిపోతున్న సోమరాజన్ మాట్లాడుతూ.. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు.