HD Kumaraswamy: సుమలతపై కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఘాటుగా బదులిచ్చిన ఎంపీ
- అక్రమ గనుల తవ్వకాలతో జలాశయానికి పగుళ్లు ఏర్పడుతున్నాయన్న సుమలత
- ఆనకట్టకు ముప్పు ఏర్పడితే సుమలతను అడ్డంగా ఉంచితే సరిపోతుందన్న కుమారస్వామి
- ఆయన నైజమేంటో బయటపడిందన్న సుమలత
మాండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర జలాశయం చుట్టూ అక్రమంగా గనుల తవ్వకంతోపాటు ఇసుక దందా కొనసాగుతోందని, దీనివల్ల జలాశయానికి పగుళ్లు ఏర్పడుతున్నాయని ఎంపీ సుమలత ఇటీవల ఆరోపించారు. సుమలత ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మాజీ సీఎం కుమారస్వామి.. జలాశయం ఆనకట్టకు ఏదైనా ముప్పు ఏర్పడితే ఆమెను అడ్డంగా ఉంచితే నీళ్లు బయటకు రావంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సరైన సమాచారం లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. భర్త అంబరీష్ మరణాన్ని ప్రచారంగా మార్చుకుని ఎన్నికల్లో గెలిచిన సుమలత వంటి నేత వల్ల ప్రయోజనం శూన్యమని విమర్శించారు. కుమారస్వామి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మాజీ సీఎం వ్యాఖ్యలపై సుమలత కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తానేంటో ఆయన నిరూపించుకున్నారని అన్నారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో కుమారస్వామి తనయుడు నిఖిల్‌పై సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.