Andhra Pradesh: 12 నుంచి ఏపీలో ఆన్ లైన్ క్లాసులు
- వచ్చే నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభం
- సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం
- ‘నాడు–నేడు’ పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. ఆగస్టు 16 నుంచి బడులు ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచే ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించనున్నారు. విద్యాసంస్థల్లో పెండింగ్ లో ఉన్న ‘నాడు–నేడు’ పనులన్నింటినీ ఆగస్టులోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.
కాగా, స్కూళ్లలో మంచి విద్యను అందించేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కొత్త విద్యావిధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ విధానంతో ఏ ఒక్క ఉపాధ్యాయుడి పోస్టూ తక్కువ కాదని, ఏ బడీ మూతపడదని తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు ఉపాధ్యాయులకు వర్క్ బుక్స్ పై శిక్షణనిస్తామన్నారు.
ఫౌండేషన్ పాఠశాలలకు రెండేళ్లలో అదనపు గదులను నిర్మించి ఇస్తామన్నారు. ఇంటర్ ఫస్టియర్ మార్కులు 70 శాతం, పదో తరగతి మార్కులు 30 శాతం కలిపి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులను వేస్తామని, ఈ నెలాఖరు లోపు మెమోలను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.