Andhra Pradesh: ఏపీలో మళ్లీ మొదలైన విద్యుత్ కోతలు.. గ్రామాల్లో మూడు గంటల అంతరాయం!
- అన్ని గ్రామాల్లోనూ సాయంత్రం ఏడు నుంచి పది గంటల వరకు కోతలు
- డిమాండ్‌కు సరిపడా లేని విద్యుదుత్పత్తి
- రెండు మూడు రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు
ఏపీలో కరెంటు కోతలు ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. గ్రామాల్లో రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు దాదాపు మూడు గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్నేళ్లుగా కనిపించని కోతలు ఇప్పుడు ఒక్కసారిగా మీద పడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో గ్రిడ్‌పై భారం తగ్గించేందుకు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఏపీ జెన్కో థర్మల్, సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు దాదాపు 95 ఎంయూల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది.
సింగరేణి నుంచి రోజుకు ఆర్టీపీపీ, వీటీపీఎస్‌లకు కలిపి 12 రైల్వే రేక్‌లు (ఒక్కో రేక్‌లో 3,500 టన్నుల బొగ్గు) వస్తున్నాయి. మరోవైపు, బొగ్గు కొరత కారణంగా కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు. మరోవైపు, వీటికి చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. సాంకేతిక కారణాలతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ఆరు యూనిట్లను నిలిపివేయడంతో ఇక్కడి నుంచి 1,234 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. విజయవాడలోని వీటీపీఎస్ నుంచి 1,537.9 మెగావాట్ల విద్యుత్ వస్తోంది.
రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులన్నింటిలోనూ రెండు మూడు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. దీనివల్ల లోడ్ సర్దుబాటు కోసం కోతలు విధించక తప్పడం లేదని పేర్కొన్నారు. కోతలను నివారించేందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.