YS Vijayamma: జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉన్నారు... ఇది దైవనిర్ణయం: వైఎస్ విజయమ్మ
- నేడు షర్మిల పార్టీ అధికారిక ప్రకటన
- హైదరాబాదులో కార్యక్రమం
- జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్న షర్మిల, విజయమ్మ
- తన బిడ్డలకు దోచుకోవడం తెలియదన్న విజయమ్మ
దివంగత వైఎస్సార్ తనయ షర్మిల ఇవాళ హైదరాబాదులో తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ చేరుకున్న షర్మిల, భారీ కాన్వాయ్ తో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు విచ్చేశారు. షర్మిల వెంట ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ, తన బిడ్డలు జగన్, షర్మిల చిత్తశుద్ధి, పట్టుదలలో తండ్రి వైఎస్ కు వారసులు అని స్పష్టం చేశారు. జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉన్నారని, ఇది దైవ నిర్ణయం అని వ్యాఖ్యానించారు. దోచుకోవడం, దాచుకోవడం తన బిడ్డలకు తెలియదని, పంచడం, సాయం చేయడమే వారికి తెలుసని అన్నారు. ఈ మూడు నెలల కాలంలో తన కుమార్తె షర్మిలపై ఎన్నో విమర్శలు వచ్చాయని, దుష్ప్రచారాలు జరిగాయని వెల్లడించారు.
వైఎస్ మరణం లేని నాయకుడని, అందరితో మమేకమై నడిచేవారే నిజమైన నాయకులు అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్సార్ అని అభివర్ణించారు. తెలంగాణ బంగారుమయం కావాలనేది వైఎస్ స్వప్నం అని అన్నారు. వైఎస్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయలేదని, ఆయన కల అసంపూర్తిగా మిగిలిందని విజయమ్మ తెలిపారు.