Justice Kanagaraj: పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సభ్యులను నియమించిన ఏపీ ప్రభుత్వం
- రాష్ట్ర పోలీసుల ఫిర్యాదుల అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్
- మూడేసి జిల్లాలకు ఒక చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకం
- బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల పదవీ కాలం
ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ఏపీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులను నియమించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు విడుదల చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేవీవీ గోపాలరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.కిశోర్, ఉదయలక్ష్మిలను సభ్యులుగా నియమించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్లు, లేదంటే 65 ఏళ్ల వయసు వచ్చే వరకు వీరు సభ్యులుగా కొనసాగుతారు. ఈ అథారిటీకి మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. కనగరాజ్ చైర్మన్‌గా ఇప్పటికే బాధ్యతలు తీసుకున్నారు. అలాగే, మూడేసి జిల్లాలకు ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు వరప్రసాదరావు చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు రిటైర్డ్ జడ్జ్ ఆర్‌జే విశ్వనాథం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నేతల రమేశ్ బాబు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు వెంకటరమణారెడ్డి చైర్మన్లుగా నియమితులయ్యారు. ఇక, జిల్లాల కమిటీ సభ్యులుగా రిటైర్డ్ కలెక్టర్లు, డీఎస్పీలను నియమించింది. దుష్ప్రవర్తన, పోలీసు కస్టడీలో మృతి, దాడి, అత్యాచారం వంటి ఫిర్యాదుల విచారణకు ఈ అథారిటీని ఏర్పాటు చేశారు.